Content-Length: 342211 | pFad | https://te.wikipedia.org/wiki/%E0%B0%86%E0%B0%95%E0%B0%BE%E0%B0%B6%E0%B0%82

ఆకాశం - వికీపీడియా Jump to content

ఆకాశం

వికీపీడియా నుండి
విమానం నుండి చూసినప్పుడు కనిపించే నీలం రంగు ఆకాశం.

ఆరుబయటనుండి పైకి చూస్తే మనకు కనిపించే నీలిరంగు ఆవరణమే ఆకాశం. ఆకాశానికి తెలుగు భాషలో వికృతి పదము ఆకసము. భూమి ఉపరితలంపై ఉండే మేఘాలు, నీటియావిరితో కూడిన వాయు ఆవరణాలపై పడిన సూర్యకాంతి పరావర్తనం చెందడం వలన ఆకాశం మనకు నీలిరంగులో కనబడుతుంది. కాని నిజానికి ఆకాశం ఏ రంగునూ కలిగి ఉండదు. అందుకే మనకు రాత్రి సమయంలో ఆకాశం సూర్యకాంతి లేకపోవడం వలన చీకటిగా కనిపిస్తుంది. ఆ చీకటిలో అనంత దూరాలలో ఉన్న నక్షత్రాలు, గ్రహాలు చిన్న చిన్న చుక్కలుగా కనిపిస్తాయి.

ఆకాశం ఎందుకు నీలంగా ఉంటుంది? ...

[మార్చు]

ఈ రకం రంగు ప్రశ్నలన్నిటికి సమాధానం అర్ధం కావాలంటే కాంతి ‘చెదరటం,’ అనే భావం అర్ధం కావాలి. గాలిలో అనేకమైన అణువులు (‘మోలిక్యూల్స్’), రేణువులు (‘పార్టికిల్స్') ఉంటాయి. ఉదాహరణకి ఆమ్లజని, నత్రజని అణువులు గాలిలో విస్తారంగా ఉంటాయి. అలాగే దుమ్ము రేణువులు, నీటి ఆవిరి అణువులు కూడ ఉంటాయి. కాంతి కిరణాలు సూర్యుడి దగ్గరనుండి మనకి చేరుకునేలోగా ఈ గాలిలో ప్రయాణం చేస్తాయి కదా. సూర్య కిరణాలు ఈ రేణువులని ఢీ కొన్నప్పుడు ఆ కాంతి చెల్లా చెదరవుతుంది. సూర్యుడి వెలుగు మన కంటికి తెల్లగా కనబడ్డప్పటికీ, అందులో ఎన్నో రంగులు ఉంటాయని ఇంద్ర ధనుస్సు చూసిన వారందరికీ పరిచయమైన విషయమే. తమాషా ఏమిటంటే ఒకొక్క రంగు ఒకొక్క విధంగా చెదురుతుంది. ఉదాహరణకి ఇంద్రధనుస్సులో తరంగ దైర్ఘ్యం (wavelength) తక్కువ ఉన్న ఊదా (‘వయలెట్’) రంగు ఎక్కువ చెదురుతుంది, తరంగ దైర్ఘ్యం ఎక్కువ ఉన్న ఎరుపు (‘రెడ్’) తక్కువ చెదురుతుంది. ( అది ప్రకృతి లక్షణం.)

సూర్యుడు ఆకాశంలో కిందకి ఉన్నప్పుడు (అంటే ఉదయం, సాయంకాలం), సూర్య కిరణాలు భూమి వాతావరణంలో చాల దూరం ప్రయాణం చేస్తే కాని మన కంటిని చేరలేవు. కనుక కిరణాలలోని రంగులు విరజిమ్మబడటానికి సావకాశాలు ఎక్కువ. కనుక నీలి రంగు ఎక్కువగా ఇటు, అటూ చెదిరి పోతుంది, కాని ఎరుపు తక్కువ చెదురుతుంది కనుక తిన్నగా మన కంటిని చేరుకుంటుంది. అందుకనే సంధ్యా సమయంలో ఆకాశం ఎర్రగా కనిపిస్తుంది. మన పల్లెపట్టూళ్ళలో గోధూళి వేళ గాలిలోకి బాగా దుమ్ము రేగుతుంది. కనుక గోధూళి వేళ ఆకాశం ఎర్రగా ఉంటుంది. సూర్యుడు నడి నెత్తి మీద ఉన్నప్పుడు కిరణాలు మన వాతావరణంలో తక్కువ దూరం ప్రయాణం చేస్తాయి. కనుక సాయంత్రం కంటే ఎక్కువ నీలి రంగు మన కంటిని చేరుతుంది. అందుకని మధ్యాహ్నం ఆకాశం నీలిగా కనబడుతుంది.

మరి దూరపు కొండల నీలిమ సంగతి? ఉదాహరణకి ‘నీలగిరులు’ అంటేనే నీలి కొండలు కదా. చెట్లు దట్టంగా ఉన్న కొండల అసలు రంగు ఆకుపచ్చ. చెట్లు తక్కువగా ఉంటే బూడిద రంగు. వీటిని దూరం నుండి చూసినప్పుడు నీలి రంగు గాలి పొరలగుండా చూస్తాం. “నీలి రంగు గాలి” అన్నానా? గాలికి రంగు లేదని చదువుకున్నాం కదా. ఇక్కడ జవాబులో కొంచెం వేదాంతం పాలు కలపాలి. నిజానికి రోదసి రంగు నల్లటి నలుపు. మనం ఆకాశం వైపు చూసినప్పుడు ఆ నల్లటి నేపథ్యంలో గాలిని చూస్తున్నాం. గాలికి స్వతహగా రంగు లేకపోయినా గాలిలోని రేణువులు కాంతిని విరజిమ్మినప్పుడు ఆ గాలి మనకి నీలంగా అనిపిస్తుంది; కనిపించదు. అది మన భ్రాంతి. అందుకోసమే దీనిని వేదాంతం అన్నాను.[1]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఆకాశం&oldid=3929459" నుండి వెలికితీశారు








ApplySandwichStrip

pFad - (p)hone/(F)rame/(a)nonymizer/(d)eclutterfier!      Saves Data!


--- a PPN by Garber Painting Akron. With Image Size Reduction included!

Fetched URL: https://te.wikipedia.org/wiki/%E0%B0%86%E0%B0%95%E0%B0%BE%E0%B0%B6%E0%B0%82

Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy