Jump to content

ద్వారక

అక్షాంశ రేఖాంశాలు: 22°14′N 68°58′E / 22.23°N 68.97°E / 22.23; 68.97
వికీపీడియా నుండి
  ?ద్వారక
గుజరాత్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 22°14′N 68°58′E / 22.23°N 68.97°E / 22.23; 68.97
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 0 మీ (0 అడుగులు)
జిల్లా (లు) జామ్ నగర్ జిల్లా
జనాభా 33,614 (2001 నాటికి)

ద్వారక శ్రీకృష్ణుని దివ్య క్షేత్రాలలో అతి విశిష్టమైంది గుజరాత్ లోని ఈ దివ్యధామం శ్రీకృష్ణుని పాదస్పర్శతో పునీతమైందిగా విశ్వసిస్తారు. జరాసంధుని బారినుండి తప్పింకొనేందుకు ఈ నగరాన్ని నిర్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడి ద్వారకాధీశుని మందిరం అతి పురాతనమైంది. ఈ మందిరాన్ని పదో శతాబ్దంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. అయితే శ్రీకృష్ణుని మనుమడు ఐన వజ్రనాధుడు ఈ మందిరాన్ని మొట్టమొదటి సారిగా నిర్మించినట్టు పురాణాలలో ప్రస్తావన ఉంది. శ్రీకృష్ణుని ద్వారకా నగరం సముద్రగర్బంలో ఇంకా వుందని పరిశోధకుల అభిప్రాయం.

నాగేశ్వర లింగం-దారుకావనం

[మార్చు]

నాగేశ్వర లింగము : ద్వాదశ జ్యోతిర్లింగాలలో 10వది "నాగేశ్వర లింగము". గుజరాత్ రాష్ట్రంలో ద్వారక నుంచి గోపితలావ్ వెళ్లే బస్సులో నాగనాధ్ వద్ద దిగి వెళ్ళవలెను. (గోమతి ద్వారక నుంచి సుమారు 14 కి.మీ. దూరము) చాలా చిన్న గ్రామం. దారుకావనమున తారకాసురుడు తన పరివారముతో నివసించి, ఆ వనమున పోవు ప్రయాణికుల ధనమును దోచి, నానాహింసలు పెట్టుచున్నాడు. సుప్రియుడను వైశ్యుడు గొప్ప వ్యాపారి, గొప్ప శివ భక్తుడు. సుప్రియుడు వ్యాపార నిమిత్తం ద్వారకా వనమున పోవు చుండగా, తారకుని అనుచరులు సుప్రియుడును, అతని సిబ్బందిని బంధించుకుపోయి, కారాగారమున ఉంచిరి. మహా భక్తుడగు సుప్రియుడు శివలింగదారి, మెడయందున్న లింగమును తీసి, అరచేతి యందుంచుకుని, పూజ చేయుచుండెను. దానిని చూచిన రాక్షస సేవకులు తారకాసురునికి చెప్పిరి. తారకాసురుడు సుప్రియునితో "నీవు దైవారాధన చేయవద్దు" అని చెప్పినా, శివ పంచాక్షరీ మంత్ర జపము చేయుచున్న సుప్రియుడు సమాధానము చెప్పలేదు. తారకాసురుడు కోపమును పట్టలేక తన చేతిలోని గదచే తలపై కొట్టబోవునంతలో, శంకరుడు అక్కడనే జ్యోతి రూపమున ఆవిర్భవించి, తారకుని సంహరించెను. సుప్రియుడు కోరికపై దారుకా వనమునందే "నాగలింగేశ్వర" నామముతో లింగరూపము ధరించెను. ఈ ప్రదేశమున పూర్వకాలమున నాగజాతి ప్రజలు నివసించేవారు. కావున ఈ జ్యోతిర్లింగమునకు "నాగేశ్వర లింగము" అని పేరు వచ్చింది.

మోక్షదాయకములైన సప్తపురములలో ఒకటి అయిన "ద్వారక" శ్రీ కృష్ణ భగవానుడు సింహాసనాన్ని అధిష్టించి, పరిపాలించింది. భారతదేశములో నాలుగు మూలాలు వున్న నాలుగు ధామాలలో ద్వారక ధామము ఒకటి. మిగతావి రామేశ్వరం, పురీ జగన్నాధ్, బదిరీనాధ్ ధామం.

భౌగోళికం

[మార్చు]

ఆధునిక ద్వారకా నగరం గుజరాత్‌లో జామ్‌నగర్ జిల్లాలో ఉంది. ద్వారకా నగరం సముద్రమట్టానికి సమముగా 0 అడుగుల సముద్ర మట్టంలో ఉంది. 22.23 అక్షాంశం 68.97 రేఖాంశంలో ఉపస్థితమై ఉంది.

ఏడుపవిత్ర పుణ్యక్షేత్రాలు

[మార్చు]

భారతదేశంలో ఉన్న హిందువుల ఏడు పవిత్ర క్షేత్రాలలో ద్వారకాపురి ఒకటి. అయితే వీటిలో శివుడు ప్రతిష్ఠితమై ఉన్న వారణాశి అత్యంత పవిత్రమైనది.

అయోధ్య మథుర మాయ కాశి కాంచి అవంతిక I

పూరి ద్వారకావతి చైవ సప్తైత మోక్షదాయిక II - గరుడ పూర్ణిమ

క్షేత్రం అంటే పవిత్రమైన ప్రదేశం. దైవిక శక్తికి కేంద్రం. జీవుడికి తుది గమ్యమైన మోక్షమును అందించే మోక్షపురి. గరుడ పురాణం పేర్కొన్న ఏడు మోక్షపురాలు వరుసగా అయోధ్య, మధుర, మాయా, కాశి, కాంచి, అవంతిక, పూరి, ద్వారావతి.

జనాభా వివరణ

[మార్చు]

2001 జనాభాగణన అనుసరించి ద్వారక జనసంఖ్య 33,614. వీరిలో పురుషుల శాతం 53%. స్త్రీలశాతం 47%. ద్వారకా నగరం అక్షరాస్యత శాతం 64%. ఇది దేశీయ అక్షరాస్యతా శాతం అయిన 59.5% కంటే అధికం. పురుషుల అక్షరాస్యతా శాతం 72%. స్త్రీల అక్షరాస్యతా శాతం 55%. ఆరుసంవత్సరాలకంటే లోపున్న పిల్లల శాతం 13%.

ద్వారకాధీశుడి ఆలయం

[మార్చు]

ప్రస్తుత ద్వారకాధీశుని ఆలయం సాధారణ శకం (కామన్ ఎరా లేక కేలండర్ ఇయర్)16వ శతాబ్దంలో నిర్మించబడింది. అసలైన ఆలయం శ్రీకృష్ణుడి మునిమనుమడైన రాజైన వజ్రుని చేత నిర్మించబడినదని విశ్వసిస్తున్నారు. 5 అంతస్తుల ఈ ఆలయం లైమ్‌స్టోన్, ఇసుకతో నిర్మితమైనది. ఈ ఆలయగోపురం మీద ఉన్నజండా ఒక రోజుకు అయిదుమార్లు ఎగురవేస్తారు. ఈ ఆలయానికి రెండు ద్వారాలు ఉంటాయి. ఒకటి స్వర్గ ద్వారం రెండవది మోక్షద్వారం. భక్తులు స్వర్గద్వారం గుండా ఆలయప్రవేశం చేసి మోక్షద్వారం గుండా వెలుపలికి వస్తారు. ఈ ఆలయము నుండి గోమతీ నది సముద్రంలో సంగమించే ప్రదేశాన్ని చూడవచ్చు. ద్వారకాపురిలో ఇంకా వసుదేవ, దేవకి, బలరామ, రేవతి, సుభద్ర, రుక్మిణీదేవి, జాంబవతీదేవి, సత్యభామాదేవి ఆలయాలు ఉన్నాయి. బెట్ ద్వారకా ఆలయానికి వెళ్ళే మార్గంలో రుక్మిణీదేవికి ప్రత్యేక ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని బోటులో ప్రయాణించి చేరుకోవాలి.

పవిత్ర నగరం

[మార్చు]

ఈ నగరం పేరులోని ద్వార్ అనే పదానికి సంస్కృత భాషలో వాకిలి, ద్వారం లాంటి అర్ధాలు ఉన్నాయి. ద్వార్ అనే పదము ఆధారంగా ఈ నగరానికి ఆఈ పేరు వచ్చింది. అనేక ద్వారాలు ఉన్న నగరం కనుక ద్వారక అయింది. హిందువులు అతి పవిత్రముగా భావిణంచే చార్ ధామ్ (నాలుగు ధమాలు) ద్వారకాపురి ఒకటి. మిగిలిన మూడు పవిత్రనగరాలు బద్రీనాధ్, పూరి, రామేశ్వరం. ఈ నగరం వైష్ణవుల చేత గౌరవించబడింది. ద్వారకాధీశుని ఆలయం జగత్‌మందిరం అని పిలువబడుతుంది. ఈ ఆలయ ప్రధాన దైవం శ్రీకృష్ణుడు. ద్వరకాపురి సమీపంలో జ్యోతిర్లింగాలలో ఒకటి అయ్న నాగేశ్వరలింగం ఉంది. ద్వారకలో శంకరాచార్యుడు ద్వారకా పీఠం స్థాపించబడింది. ఈ మఠం శ్రీకృష్ణభగవానుడికి సమర్పించబడింది. ఆది శంకరాచార్యుడితో ప్రతిష్ఠించబడిన నాలుగు మఠాలలో ఇది ఒకటి. మిగిలినవి శృంగేరి, పూరి, జ్యోతిర్మఠం. ద్వారకా పీఠాన్ని కాళికా పీఠంగా కూడా అంటారు.

శ్రీద్వారకనాధ్ మహత్యం

[మార్చు]

ఆదిశంకరులు ద్వారకాధీశుడిని దర్శించి ద్వారకాపీఠాన్ని ప్రతిష్ఠించాడు. ఇక్కడ కృష్ణుడు క్షత్రియ రాకుమార వివాహ అలంకరణలో దర్శనం ఇస్తాడు. 108 దివ్యదేశాలలో ఈక్షేత్రం ఒకటి.

దర్శనం సేవలు, ఉత్సవాలు

[మార్చు]

ద్వారకానాధుడికి అనేక సేవలు దర్శనాలు ఉంటాయి. దర్శనలకు తగినట్లు వస్త్రధారణలో మార్పులు జరుగుతుంటాయి. ఈ దర్శనాల వల్లభాచార్యుల చేత వ్రాయబడిన పుష్టి మార్గాంలో వ్రాయబడినట్లు జరుగుతాయి. ద్వారకానాధుని ఆలయం పుష్టి మార్గ ఆలయం. దర్శనాలు వరుసగా

  • మంగళ.
  • శృంగార్.
  • గ్వాల్.
  • రాజభోగ్.
  • ఉథాపన్.
  • భోగ్.
  • సంధ్యా ఆరావళి.
  • ష్యాన్.

ద్వారకా సామ్రాజ్యం

[మార్చు]

మహాభారతం, హరివంశం, స్కంద పురాణం, భాగవత పురాణం, విష్ణు పురాణం లాలలో ద్వారకాపురి ప్రస్తావన ఉంది. ప్రస్తుత ద్వారకాపురి సమీపంలో శ్రీకృష్ణ నిర్మితమైన ద్వారాపురి ఉండేదని. పురాణేతిహాసాలలో వర్ణించబడిన విధంగా అది సముద్రగర్భంలో కలసి సముద్రగర్భంలో కలసి పోయి కనిపించకుండా పోయిందని విశ్వసిస్తున్నారు.

శ్రీకృష్ణుడు యుద్ధాల వలన జరిగే అనర్ధాల నుండి ద్వారకా వాసులను రక్షించే నిమిత్తం ద్వారకానగర నిర్మాణం చేసి యాదవులను ఇక్కడకు తరలించి సురక్షితంగా పాలించాడని పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి. శ్రీకృష్ణుడు కంసవధ అనంతరం కంసుడి తండ్రి అయిన ఉగ్రసేనుడిని చెరసాల నుండి విముక్తిడిని చేసి మథురకు రాజును చేసాడు. కంస వధకు కినుక చెందిన అతడి మామగారైన జరాసంధుడు తన స్నేహితుడైన కాలయవనుడితో కలసి 17 మార్లు మథుర మీద దండయాత్ర చేసాడు. యుద్ధాల నుండి ప్రజలను రక్షించే నిమిత్తం శ్రీకృష్ణుడు యాదవ ప్రముఖులతో సమాలోచనలు జరిపి సముద్రపరివేష్టితమైన భూమిలో ద్వారకానగరిని నిర్మించి దానికి మథురలోని యాదవులను తరలించాడు. 17 మార్లు జరిగిన దండయాత్రలలో అతడు తన సైన్యాలంతటిని క్షీణింపజేసుకున్నాడు. ఒక్కో మారు జరాసంధుడు 18 అక్షౌహినుల సైన్యంతో దాడి చేసే వాడు. మహారత యుద్ధంలో పండవుల, కౌరవుల సైన్యం మొత్తము 18 అక్షౌహినులు. శ్రీకృష్ణుడు 18వ దండయాత్రకు ముందుగా మథురను వదిలి వెళ్ళాడు. జరాసంధుడు 800 నుండి 1000 సంవత్సరాలు జీవించినట్లు అంచనా. భీష్ముడు కూడా 800 నుండి 1000 సంవత్సరాలు జీవించినట్లు అంచనా.

ద్వారకా నగరం శ్రీకృష్ణుడి ఆజ్ఞానుసారం విశ్వకర్మ నిర్మించాడని ప్రతీతి. సౌరాష్ట్రా పడమటి సముద్రతీరంలో ఈ భూమి నగర నిర్మాణార్ధం ఎంచుకొనబడింది. ఈ నగరం ప్రణాళిక చేయబడి తరువాత నిర్మించబడింది. గోమతీనదీ తీరంలో ప్రణాళికా బద్ధంగా నిర్మించబడిన నగరం ద్వారక. ఈ నగరాన్ని ద్వారామతి, ద్వారావతి, కుశస్థలిగా పిలువబడింది. ఇది ఆరు విభాగాలుగా నిర్వహణా సౌలభ్యం కొరకు విభజించి నిర్మించబడింది. నివాస ప్రదేశాలు, వ్యాపార ప్రదేశాలు, వెడల్పైన రాజమార్గాలు, వాణిజ్యకూడలులు, సంతలు, రాజభవనాలు, అనేక ప్రజోపయోగ ప్రదేశాలతో నిర్మితమైనది. రాజ్యసభా మంటపం పేరు సుధర్మ సభ రాజు ప్రజలతో సమావేశం జరిపే ప్రదేశం ఇదే. ఈ నగరం సుందర సముద్రతీరాలకు ప్రసిద్ధం. ఈ నగరంలో 7,00,000 ప్రదేశాలు స్వర్ణ, రజిత, మణిమయమై నిర్మించబడ్డాయి. శ్రీకృష్ణుడి 16108 మంది భార్యలకు ప్రత్యేక మందిరాలు ఉన్నాయి. వీటితో పాటు ఈ నగరంలో సుందర సరస్సులతో సర్వకాలంలో పుష్పించి ఉండే వివిధమైన వర్ణాలతో శోభిల్లే ఉద్యానవనాలు ఉంటాయి.

సముద్రంలో మునుగుట

[మార్చు]

శ్రీకృష్ణుడు తన అవతారమును చాలించి వైకుంఠము చేరిన తరువాత ఈ పవిత్ర నగరం సముద్రపు జలాలలో మునిగిపోయింది. ఈ నగరం మహాభారత యుద్ధం జరిగిన 36 సంవత్సరాల అనంతరం సముద్రగర్భంలో కలిసి పోయింది. యాదవ ప్రముఖులు గాంధారి శాపప్రభావాన మునుల శాపప్రభావాన తమలోతాము కలహించికొని నిశ్శేషంగా మరణించిన తరువాత శ్రీకృష్ణుని ఆదేశం మీద అర్జునుడు యాదవకుల సంరక్షణార్ధం ఇక్కడకు వచ్చి శ్రీకృష్ణ బలరాములకు అంత్యక్రియలు నిర్వహించి ద్వారాకాపుర వాసులను ద్వారక నుండి దాటించిన మరు నిమిషం ద్వారకానగరం సముద్రంలో మునిగిపోయింది. ద్వారకానగరాన్ని దాటిన యాదవులు ద్వారకానగరం సముద్రజలాల్లో మునిగి పోవడం వెనుతిరిగి చూసి హాహాకారాలు చేసారు. అర్జునుడు ఈ విషయం హస్థినాపురంలో వర్ణిస్తూ " ప్రకృతి ద్వారకానగరాన్ని తనలో ఇముడ్చుకుంది. సముద్రం నగరంలో ప్రవేశించి ద్వారకానగర సుందరమైన వీధులలో ప్రవహించి మెల్లగా నగరాన్ని సంపూర్ణంగా తనజలాల్లో ముంచివేసింది. అందమైన భవనాలు ఒకటి తరువాత ఒకటి మునగడం నేను కళ్ళారా చూసాను. అంతా మునిగి పోయింది. అక్కడ నగరం ఉన్న సూచనలు ఏమీ లేవు చివరకు ఒక సరస్సులా ఆ ప్రదేశం కనిపించింది. అక్కడ నగరం ఉన్న జాడలు లేవు. ఇక ద్వారక ఒక పేరు మాత్రమే ఒక జ్ఞాపకం మాత్రమే " . విష్ణు పురాణం ద్వారకానగర మునక గురించి ప్రస్తావించింది. ఇలా ద్వారకానగరం సముద్రగర్భంలో కలసి పోయి అంతటితో ద్వాపరయుగం అంతమై కలిపురుషుడు ఈ లోకంలో ప్రవేశించి కలియగానికి నాంది పలికాడు.

ఆధునిక నిర్మాణశాస్త్ర నిపుణుల పరిశోధనలు

[మార్చు]

2001 మే 19న అప్పటి భారతీయ సైన్స్& ‍టెక్నాలజీ మంత్రి అయిన మురళీ మనోహర్ జోషీ ద్వరకానగర శిథిలాలను గల్ఫ్ ఆఫ్ ఖంభాత్ సముద్రగర్భంలో కనుగొనబడినట్లు ప్రకటించాడు. గల్ఫ్ ఆఫ్ ఖంబాత్‌లో ఈ శిథిలాలు గుజరాత్ సముద్రతీల సమీపంలో 40 మీటర్ల లోతులో 9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నట్లు కనుగొనబడ్డాయి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీకి చెందిన ఒక బృందం చేసిన పరిశోధనలలో సముద్రగర్భంలోని ద్వారాపురి కనుగొనబడింది. ఆరు మాసాల పరిశోధనానంతరం 2000 డిసెంబరు మాసంలో కనుగొన్నారు. ఈ పరిశోధనానంతరం అదే విద్యా సంస్థ 2001లో జరిపిన పరిశోధనలో సముద్రజలాల్లో మునుగి ఉన్న కళాఖండాలను స్వాధీనపరచుకున్నారు. అలా లభించిన కళాఖండాల లోని భాగాలు యు కె లోని ఆక్స్‌ఫర్డ్, జర్మనీ లోని హానోవర్ అలాగే పలు భారతీయ విద్యాసంస్థలకు కాలనిర్ణయ పరిశోధనా నిమిత్తం పంపబడ్డాయి.

బెట్ ద్వారక

[మార్చు]

బెట్ ద్వారక ప్రధాన దైవమైన శ్రీకృష్ణుని ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. పురాతన హిందూ సంప్రదాయానికి బెట్ ద్వారక ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సముద్రతీర ప్రదేశాలు పురాతన వస్తువులకు ప్రసిద్ధి చెందినవి. ఇక్కడ లభించే మట్టి పాత్రల అవశేషాలు క్రిస్టియన్ శకంలో సముద్రతీర దేశాలతో జరిగిన వ్యాపారం, వాణిజ్యాలకు తార్కాణం. ఈ పుష్కలమైన రేవుపట్టణం, మతప్రధానమయిన కేంద్రం. శ్రీకృష్ణుడు అవతారం చాలించి వైకుంఠానికి వెళ్ళిన తరువాత సముద్రగర్భంలో కలసి పోయిందని విశ్వసించబడుతుంది. నిర్మాణశాస్త్ర నిపుణుల బృందాల పరిశోధనా ఫలితంగా అనేక పురాతన కళాఖండాలు సముద్రగర్భం నుండి వెలుపలికి తీసుకురాబడ్డాయి. అత్యంత పుస్కలంగా పురాతన వస్తువులు లభించిన సాంస్కృతిక ప్రదేశాలు బెట్ ద్వారకా I, II, VI, IX. బేట్ ద్వారకలో లభించిన వస్తువులను రెండు బృహత్తర కాలాలకు సంబంధించినవిగా విభజించించారు. వీటిలో మూడు తలలు కల జంతువుతో అలంకరించబడిన శంఖం ఒకటి, మూడు వ్రాతఫలకాలు, ఒక రాగి చేపలగాలం, హరప్పన్ సాంస్కృతిక (క్రీ పూ 1700-1400 ) ల చివరికాలపు మృణ్మయ పాత్రలు, చారిత్రక సమయాన్ని సూచించే నాణాలు, కుండలు. ఈ సముద్రతీర సముద్రగర్భ పరిశోధనలు బెట్ ద్వారకాద్వీపం దాని చుట్టుపక్కల ప్రదేశాలు సముద్రతీవ్రత మూలంగా భూఊచకోతకు గురి అయిన విషయాన్ని బలపరుస్తుంది. సముద్రపు పొంగు వలన మునిగిపోయిన ప్రదేశాలలో బెట్ ద్వారక ఒకటి. సముద్రగర్భ బెట్ ద్వారకా పరిశోధనలన అనేక ఆకారములలో రాతి లంగర్లు వెలుగులోకి వచ్చాయి. త్రిభుజాకారము, గ్రేప్నెల్, వృత్తాకారపు రాతిలంగర్లు లభించిన వాటిలో ఒకటి. అవి ఆయా ప్రాంతీయమైన రాయితో చేయబడినవి వాటి కాలనిర్ణయము కూడా ద్వారకలో ఉన్న రాళ్ళను పోలి ఉంది. సమీపకాలంలో రోమన్ పరిశోధనలలో పురాతన వస్తువులలో మృణ్మయ కూజా పెంకులు, సత్తు (లీడ్) పోత బిళ్ళలు, సత్తు లంగర్లు లభించాయి. బెట్ ద్వారకలో రోమన్ నౌకా అవశేషాలు ఉన్నట్లు కనుగొనబడింది. ఈ పరిశోధనల కారణంగా భారతదేశ విదేశీ వాణిజ్యానికి ముఖ్యంగా పశ్చిమదేశాలతో సాగించిన వాణిజ్యానికి సంబంధించిన ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. భారతదేశం రోమ్‌తో క్రీ.పూ 4 శతాబ్దం నుండి క్రీ శ 4వ శతాబ్దం వరకు చురుకుగా నౌకాయాన వ్యాపారం సాగించిందని ఈ పరిశోధనల వలన రుజువైనది. ఈ పరిశోధనలలో కాలనిర్ణయం మీద ప్రత్యేక దృష్టితో పరిశీలించి ఇవి క్రీ పూ 1వ క్రీ శ 2 శతాబ్ధాలనాటివని కనిపెట్టారు. బెట్ద్వారకలో లభించిన ఈ మృణ్మయ కూజాలు భారతదేశానికి రోమన్‌దేశాలతో పురాతనకాల వ్యాపారసంబంధాలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ లభించిన ఏడు కూజాలకు ఉపయోగించిన సీలు పరిశోధిస్తే అవి రోమన్లు ద్రాక్షారసం, ఆలివ్ ఆయిల్ ఎగుమతికి ఉపయోగిస్తారని భావిస్తున్నారు. మృణ్మయ పెంకులపై జరిగిన విస్తారమైన పరిశోధనలు క్రీస్తు శకం ఆరంభంలో బెట్ ద్వారకకు అంతర్జాతీయంగా ఉన్న వ్యాపారసంధాలు సూచిస్తున్నాయి. ప్రస్తుత పరిశోధనలు బెట్ ద్వారకా సముద్రగర్భంలో రోమన్ వ్యాపార సంబంధాలను ఋజువు చేయగల నౌకా అవశేషాలు లభిస్తాయని భావిస్తున్నారు. మృణ్మయ పాత్రలు బెట్ ద్వారకకు రోమ్‌తో కల వ్యాపార సంబంధాలు ముందు ఊహించిన దానికంటే ముందు నుండి ఉన్నాయని నిరూపిస్తున్నాయి. ఈ పూరాతత్వ పరిశోధనలలో లభించిన లంగర్లు భారతదేశ పశ్చిమతీరాలలో అనేక రేవులు, ఓడలు నిలుపు గట్లు, లంగరువేయు కేంద్రాల అవశేషాలు ఉన్నట్లు సూచిస్తున్నా బెట్ ద్వారక సమీపంలో అలాంటి గట్లు ఏమీ లేవు . అయినా ఇక్కడ లభించిన రాతి లంగర్లు మాత్రం ఎత్తైన బెట్ ద్వరకా సముద్రతీరాలు నౌకలు లంగర్ వేసి నిలవడానికి వీలుగా ఉన్నాయని భావిస్తున్నారు. కనుక బెట్ ద్వారక సహజసిద్ధమైన రేవుపట్టణం. ఇక్కడ అధిక సంఖ్యలో లభించిన అనేక విధములైన రాతి లంగర్లు పురాతనకాలంలో ఉన్న రేవుపట్టణాలలో బెట్ ద్వారక చాలా ప్రముఖమైనదని సూచిస్తున్నాయి. బెట్ ద్వారక పరిసరాలు నౌకలు సురక్షితంగా నిలవడానికి అవకాశం కల్పిస్తూ ఈ నగరాన్ని శక్తివంతమైన సముద్రతరంగాల నుండి రక్షించిందని తెలియజేస్తున్నాయి.

  • సముద్రగర్భంలో ఉన్న ద్వారకానగరాన్ని చూపడానికి తగిన ఏర్పాట్లు చేయడానికి సన్నాహాలు చేస్తూ ప్రతిపాదన చేయబడింది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటకరంగం ఈ ప్రతిపాదన మీద పనిచేస్తున్నారు. రెండుదశాబ్ధాలపాటు జరిగే ఈ ప్రణాళిక పూర్తి చేసుకుంటే అది ప్రపంచంలో ఉన్న మొట్టమొదటి సముద్రాంతర వస్తుప్రదర్శనశాల ఔతుంది.

వాగ్గేయకారులు

[మార్చు]

108 దివ్యక్షేత్రాలు

[మార్చు]

వివరాలు

[మార్చు]
ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వారా దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
కల్యాణ నారాయణన్ కల్యాణదేవి, గోమతీదేవి, అష్టమహిషలు గోమతీ నది పశ్చిమ ముఖము నిలచున్న భంగిమ నమ్మాళ్వార్-తిరుమంగై ఆళ్వార్-ఆండాళ్-పెరియాళ్వార్ హేమకూట విమానము ద్రౌపతికి

విశేషాలు

[మార్చు]

ఇది ముక్తి ప్రద క్షేత్రములలో ఒకటి. సన్నిధికి సమీపముననే గోమతీ నది సముద్రములో సంగమిస్తుంది. అక్కడ నుండి బస్సుమార్గంలో పోయి బేటి ద్వారక చేరాలి. ఇది శ్రీకృష్ణుని నివాస స్థలము. ఇచట 1500 నివాస గృహాలు ఉన్నాయి. ఇక్కడ మాలవరులు శంఖ చక్రధారియై ఉపస్థితమై ఉన్నాడు. దీనికి 5 కి.మీ. దూరమున శంఖతీర్థము ఉంది. ఇక్కడ పెరుమాళ్ళ వక్షస్థలమున శ్రీదేవి ఉపస్థితమై ఉంది. రుక్మిణీదేవి ఉత్సవ తాయార్. ఉక్కడ అనేక సన్నిధులు ఉన్నాయి. ప్రతిదినము తిరుమంజనము జరుగును. పసిపిల్లవానివలె-రాజువలె-వైదికోత్తమునివలె అలంకారములు జరుగుతుంటాయి.

ద్వారక నుండి ఓఘ పోవుమార్గములో 5 కి.మీ. దూరమున రుక్మిణీదేవి సన్నిధి ఉంది. ఇదియే రుక్మిణీ కల్యాణము జరిగిన ప్రదేశము. ద్వారక సమీపమున తోతాద్రి మఠము ఉంది. విరావన్‌స్టేషన్‌లో దిగి 160 కి.మీ. దూరమునగల రైవతక పర్వతమును చేరవచ్చును. ఇచట అనేక సన్నిధులు ఉన్నాయి. కృష్ణావతారమునకు ముందుగానే వెలసున ప్రదేశంలో శయనభంగిమలో స్వామి ఉపస్థితమై ఉన్నాడు.

మార్గం

[మార్చు]

బొంబాయి-ఓగా రైలుమార్గములో ఓగారేవు ముఖద్వారానికి 35 కి.మీ. దూరము. అహమ్మదాబాద్ నుండి బస్‌లు గలవు. అన్నివసతులు కలవు

సాహిత్యం

[మార్చు]

శ్లో. శ్రీ గోమతీ పుణ్య సరస్తటస్థే శ్రీ ద్వారకాఖ్య నగరే విరాజన్
   కల్యాణ నారాయణ నామధేయ:కళ్యాణదేవ్యా పరిభూషితాజ్గ:||
   దివ్యాష్ట మహిషీ నాథో ద్రౌపదీ దృష్టి గోచర:
   హేమకూట విమానస్థ: పశ్చిమాభి ముఖానస:|
   పరాంకుశ కలిధ్వంసి గోదావిష్ణు మనస్తుత:||

పాశురాలు

[మార్చు]

పా. కూట్టిలిరున్దు కిళియెప్పోదుమ్‌ కోవిన్దా! కోవిన్దా! ఎన్నழைక్కుమ్‌
   ఊట్టక్కొడాదు శెఱుప్పనాగిల్ ఉలగళన్దాన్! ఎన్ఱు ఉయరక్కూవుమ్;
   నాట్టిల్ తలైప్పழிయెయ్‌ది యుజ్గళ్ నన్మైయిழన్దు తழయిడాదే
   శూట్టుయర్ మాడజ్గళ్ శూழ்న్దు తోన్ఱుమ్‌ తువరావదిక్కెన్నైయుయ్ త్తిడుమిన్.
            ఆణ్డాళ్-నాచ్చియార్ తిరుమొழி 0-12-9

ప్రముఖ వ్యక్తులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ద్వారక&oldid=4348846" నుండి వెలికితీశారు
pFad - Phonifier reborn

Pfad - The Proxy pFad of © 2024 Garber Painting. All rights reserved.

Note: This service is not intended for secure transactions such as banking, social media, email, or purchasing. Use at your own risk. We assume no liability whatsoever for broken pages.


Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy